కొడుకు తరచూ ఫోన్లు చేయడం, భార్య కూడా పదే పదే చెప్పడంతో రాఘవరావు ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లుచూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారు. పాతిక ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈనాటి ఫాషన్ కి అనుగుణంగా లేదని కొందరు, ఇల్లు చిన్నది, చుట్టూ స్థలం ఎక్కువ వదిలేసారని మరి కొందరు వెనక్కి వెళ్ళిపోయారు. ఇల్లు బేరం పెట్టి రెండు నెలలు గడిచినా సరైన బేరం రాలేదు. జానకమ్మ బెంగ పెట్టుకుంది, కొడుకుకి సాయం చేయలేకపోతున్నామని. ఒక రోజు షావుకారు వెంకటరావు వచ్చాడు ఇల్లు చూడటానికి. ప్రతి గది పరిశీలన చేసాడు. దొడ్డి అంతా టేపు తో కొలిచాడు. భార్యాభర్తలు ఇద్దరూ అతను ఏం చెబుతాడా? అని ఆతృతగా చూస్తున్నారు. చివరికి పెదవి విప్పాడు షావుకారు…“మాస్టారుగారూ, ఇల్లు కట్టి పాతిక ఏళ్ళు అయ్యింది, అంటే పాతదాని కిందే లెక్క. ఎవరైనా కొనుక్కున్నా ఒక కుటుంబమే ఉండాలి. మీరు ఏభై లక్షలు చెబుతున్నారు. అంత ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరూ కొనరు. ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే కొత్త ఇల్లే కట్టుకుంటారు. ఏమంటారు?” రాఘవరావు మౌనం వహించాడు. జానకమ్మే అంది. ‘ఇక్కడ గజం రేటు పదివేలకు పైమాటే. అలా చూసినా, నాలుగు వందల గజాలకు నలభై ల...