Image

తెలుగు పద్యరత్నాలు

ఆనందంబున నర్థరాత్రములఁ జంద్రాలోకముల్ కాయగా 
 నానా సైకత వేదికాస్థలములన్ నల్దిక్కులన్ శంభుఁ గా 
 శీనాథున్ దరుణేందుశేఖరు శివున్ శ్రీకంఠునిన్ బాడుదు 
 న్మేనెల్లం బులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటి లోన్. 

 ఆ మందాకిని యా త్రివేణి వలనం బాబాహ్యకక్ష్యాస్థలం 
బామధ్యాంతర కక్ష్యలా విమల దివ్యజ్యోతి రుజ్జృంభణ 
 శ్రీమద్విశ్వపతీశలింగము మదిం జింతింపఁ గాశిమహా 
గ్రామంబిప్పుడు నా కనుంగవకు సాక్షాత్కారముం గైకొనువ్. 

 కలడందురు దీనులయెడ, 
 కలడందురు భక్తియోగి గణముల పాలం, 
 కలడందురన్ని దిశలను, 
 కలడు కలండనెడివాడు కలడో లేడో 

 ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై 
యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం 
బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము దాన యైన వా 
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్‌ 

 "లా వొక్కింతయు లేదు ధైర్యమువిలోలంబయ్యెబ్రాణంబులున్ 
ఠావుల్ దప్పెనుమూర్ఛవచ్ఛెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ 
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్; 
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా! 

 సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే 
పరివారంబునుఁ జీరఁ; డభ్రగపతిం బన్నింపఁ; డా
కర్ణికాం తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో 
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై. 

 యా కున్దేన్దు తుషార హారధవళా యా శుభ్ర వస్త్రాన్వితా 
యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా 
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైః సదా వందితా 
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా 

 అమ్మలఁ గన్నయమ్మ, ముగ్గురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె 
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో 
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా 
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్. 

 "అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో? 
నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; న న్నీవు గొట్టంగ వీ 
రి మ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం 
ధ మ్మాఘ్రాణము జేసి నా వచనముల్ దప్పైన దండింపవే.

" అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా 
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో 
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి 
హ్వాల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై. 

 ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై 
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై 
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై 
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. 

 ఇందు గలఁ డందు లేఁ డని 
సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెం 
దెందు వెదకి చూచిన 
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే.

" పలికెడిది భాగవత మఁట, 
పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ 
బలికిన భవహర మగునఁట, 
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా? 

 మందార మకరంద మాధుర్యమునఁ దేలు-   
మధుపంబు వోవునే మదనములకు? 
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు-   
రాయంచ సనునె తరంగిణులకు? 
లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు-   
కోయిల చేరునే కుటజములకుఁ? 
బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక-   
మరుగునే సాంద్ర నీహారములకు? 

 నంబుజోదర దివ్యపాదారవింద 
చింతనామృతపానవిశేషమత్త 
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు? వినుతగుణశీల! మాటలు వేయు నేల?" 

 "మ్రింగెడి వాఁడు విభుం డని 
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్ 
మ్రింగు మనె సర్వమంగళ 
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో! 

 శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా! 
లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా 
నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా! 
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!

" సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే 
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే 

 ప్రతిపదార్థము: సర్వమంగళ మాంగళ్యే = శుభకరమైన వాటన్నింటి శుభకరమైనది /మంగళకరమైనది (సర్వమంగళ నామము చేత మంగళ స్వరూపుడైన); శివ = శివ సతి అయిన శక్తి లేదా పార్వతి; సర్వ = అన్ని = అర్థ = అర్థములను (ధర్మ+ అర్థ+కామ+మోక్ష అను చతుర్విధ పురుషార్థములు): సాధికే = సాధించినది; శరణ్యే = శరణం/ఆశ్రయం = కల్పించేది; త్ర్యంబకే = త్రి + అంబిక = మూడు కన్నులు గలవాడు దేవేరి అనగా పార్వతి; దేవి = దేవి/దేవి; నారాయణి = పార్వతి; తే =3 నీకు, నమః = నమస్కారము/ప్రణామం; అస్తు = అగు గాక 

 కమలాక్షు నర్చించు కరములు కరములు; 
 శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ; 
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; 
 శేషశాయికి మ్రొక్కు శిరము శిరము; 
విష్ణునాకర్ణించు వీనులు వీనులు; 
 మధువైరిఁ దవిలిన మనము మనము; 
భగవంతు వలగొను పదములు పదములు; 
 పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి; 

 తే. దేవదేవుని చింతించు దినము దినము; 
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు; 
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు; 
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి...భా. 7-169-సీ. 

 చేత వెన్న ముద్ద - చెంగల్వ పూదండ 
బంగారు మొలత్రాడు - పట్టుదట్టి 
సందిట తాయత్తులు - సిరిమువ్వ గజ్జలు 
చిన్ని కృష్ణా నిన్ను - చేరి కొలుతు 

 ఒరులేయవి యొనరించిన 
నరవర! య ప్రియము మనంబున కగు, దా 
నొరులకవిసేయకునికియె 
పరాయణము పరమధర్మ పథములకెల్లన్ 

 రాకన్మానవు హానివృద్ధులు మహారణ్యంబులో దాగినన్ 
పోకన్మానదు దేహమేవిధమునన్ బోషించి రక్షించినన్ 
గాకన్మానవు పూర్వజన్మకృతముల్ గాగల్గు నర్థంబులున్ 
 లేకన్మానవదెంత జాలిబడినన్ లేముల్ సిరుల్ రాఘవా !

మతి దలపగ సంసారం 
బతి చంచల మెండమావు లట్టుల సంపత్ 
ప్రతతులతి క్షణికంబులు 
గత కాలము మేలువచ్చు కాలము కంటెన్. 

 క్రూరులు , విలుప్త ధర్మా 
చారులు ధృతరాష్ట్ర సుతులసద్వృత్తులు ని 
ష్కారణ వైరులు వీరల 
కారణమున నెగులు పుట్టు కౌరవ్యులకున్( ఆది - 159, 160.) 

స్థిరములు "కావు కావు" చల జీవితముల్; సిరిసంపదల్ సుఖం 
కరములు "కావు కావు"; పలుగద్దెలు మిద్దెలు నాత్మశాంతి కా 
కరములు "కావు కావు"; నవకమ్ములు నిత్యము "కావు కా"; వటం 
చరచుచునుండె కాకి; కను మల్లదిగో బహరాము గోరిపై! '

జీవితంలో ఏ క్షణాలూ సుస్థిరమైనవి కావు. అంతలోనే సమసిపోతాయి. సంపదలు, వాటివల్ల వచ్చే సుఖాలు స్థిరమైనవి కావు. అవి నశించిపోతాయి. మేడలు, మిద్దెలు, అందాలు, ఐశ్వర్యాలు స్థిరమైనవి కావు. అవన్నీ కరిగిపోతాయి. దానికి ఉదాహరణ ఈ గోరీయే అని ఒక ధనవంతుని గోరీమీద కూర్చుని కాకి అందరికీ "కావు కావు" అని బోధన చేస్తోంది’ అని ఒక కవి చక్కగా కాకి అరుపును సమర్థించాడు. కావు కావుమని అరిచే కాకి కూతను జీవిత సత్యాలను బోధించిన విధంగా చెప్పిన ఈ పద్యం చాలా ప్రసిద్ధి చెందింది. 

 కావె కష్టించి పెంచిన సంపదలు నాస్తులు పరుల పాలు, 
కాదె ప్రీతిమై పోషించి పెంచిన దేహము భగ్గుమనెడి అగ్గిపాలు 
కావె అస్థికల్, చితాభస్మమున్ ప్రవహించు గంగపాలు, 
కాదె కడకు నీకై నిడిన పిండము కావు కావనెడి కాకములపాలు, 
కర్మఫలమొక్కటె కాదె నీ ఆత్మనంటియుండు నిత్యమను సత్యము కాంచ ననఘా" 

 'ఏడ్చుచు పుట్టినా రెపుడొ! యేడ్చుచు పోదురు రేపు! సాటివా 
రేడ్చుదు రీర్ష్యతోడ; పెడయేడ్పుల సంత జగమ్మిదంత; ఇ 
ట్లేడ్చుచు మొండి బండ బ్రతు కీడ్చుట మంచిదొ! గోస్తనీ రస 
మ్మోడ్చుక త్రావి కన్ను లరమోడ్చుట మంచిదొ నిశ్చయింపుమీ!' 

 'కాలము నిల్వబోదు క్షణకాలము; మృత్యువుచేతిలోని కూ 
జాలము; నిల్వజాలని నిజాలము; ఎప్పటి కేమొ చెప్పగా 
జాలము; గాన ఎందుకిక జాలము? బాలకురంగనేత్ర! నీ 
వాలుగనుల్ తళుక్కుమన వంచుము శీధువు పానపాత్రలో?' 

 అంబుధు లీదవచ్చు; ప్రళయాగ్నుల గుప్పిట బట్టవచ్చు; గ్రం 
థంబులు వ్రాయవచ్చు; గగనానికి నిచ్చెన వేయవచ్చు; వి 
శ్వంబు జయింపవచ్చు; హిమశైలము నెక్కగవచ్చు గాక; చో 
ద్యంబగు చావుపుట్టుకల దైవరహస్య మెరుంగవచ్చునే 

 ఉండగ చిన్నిపాకయు, పరుండగ చాపయు, రొట్టె లొక్కటో 
రెండొ భుజింప, డెంద మలరింపగ ప్రేయసి, చెంతనుండగా పండుగగాదె జీవితము! భ్రష్టనికృష్టుల కొల్వుసేయుటల్ .
👈Click to Share in Whatsapp
గ్రంథాలయం

సేకరణ : Social Media

Popular Posts

సంపద

సహాయం